కాశీనాథుని నాగేశ్వరరావు (మే 1, 1867 - 1938) ప్రముఖ పాత్రికేయుడు,
వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల
విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని
ప్రోత్సహించాడు. ఆయనను 'నాగేశ్వరరావు
పంతులు' అనేవారు. దేశోద్ధారక అని ఆయనను అంతా గౌరవించేవారు. 1935లో ఆంధ్ర
విశ్వవిద్యాలయం ఆయనను 'కళాప్రపూర్ణ' బిరుదుతో సత్కరించింది.నాగేశ్వరరావు పెద్ద చదువులు చదవలేదు. పదవులు ఆశించలేదు. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం సంస్థలను ఆయన స్థాపించాడు. ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్ర గ్రంథాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసేడు. ఆయన స్వయంగా రచయిత. భగవద్గీతకు వ్యాఖ్యానం రాసేడు.
ఆయనకు విశ్వదాత, దేశోద్ధారక అనే బిరుదులు ఉన్నాయి. ఆయన తలచుకొంటే లక్షలపై లక్షలు ఆర్జించి కోట్లకి పడగలెత్తేవాడు. ఆడంబర రాజకీయాల జోలికి పోలేదు. అమృతాంజనం ద్వారా గణించిన డబ్బును పేద విద్యార్ధులకి వేతనాలుగా ఇచ్చేసేవాడు. ఆయన దేశభక్తినీ వితరణశీలాన్నీ గాంధీ మహాత్ముడు కూడ మెచ్చుకున్నాడు[ఆధారం కోరబడినది].
చెన్నై లోని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ లోనే చారిత్రాత్మక శ్రీబాగ్ ఒడంబడిక కుదిరింది. కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఈ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
కాశీనాధుని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఎలకుర్రు గ్రామంలో 1867 లో మే 1న జన్మించాడు. తల్లిదండ్రులు: శ్యామలాంబ, బుచ్చయ్య. స్వగ్రామంలోనూ, తరువాత మచిలీపట్నంలోనూ విద్యాభ్యాసం కొనసాగింది. 1891లో 'మద్రాసు క్రిస్టియన్ కాలేజి'లో పట్టభద్రుడయ్యాడు. ఆ కాలేజిలో ప్రమముఖ విద్యావేత్త డా.రెవరెండ్ మిల్లర్ ప్రభావం ఆయనపై బడింది. వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం వ్యాసాలు కూడా ఆయనను ప్రభావితం చేశారు
నాగేశ్వరరావు కొద్దికాలం మద్రాసులోనూ, కలకత్తాలోనూ, బొంబాయిలోనూ ఉద్యోగ వ్యాపారాలు నిర్వర్తించాడు. వ్యాపారంపైన ప్రత్యేక ఆసక్తితో 1893లో అమృతాంజన్ లిమిటెడ్ స్థాపించాడు. ఆయన స్వయంగా రూపొందించిన అమృతాంజనం అతి కొద్దికాలంలో అద్భుతమైన ప్రజాదరణ పొందింది.
సెప్టెంబరు 1908లో బొంబాయినుండి ఆయన ప్రారంభించిన ఆంధ్ర పత్రిక వార పత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాగేశ్వరరావు వ్యాసాలు ఆయన సామాజిక చేతనా దృక్పధాన్నీ, సమకాలీన చరిత్రపై ఆయన అవగాహననూ ప్రతిబింబించాయి. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులనూ, రాజకీయ పరిణామాలనూ తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే ఉద్దేశ్యంతో ఆంధ్ర పత్రిక దిన పత్రికను ప్రారంభింఛాడు. 1914 ఏప్రిల్ 1న మద్రాసునుండి ఈ పత్రిక తొలిసారిగా వెలువడడం తెలుగు పత్రికా రంగంలో ఒక సువర్ణాధ్యాయం. 1924లో భారతి అనే సాంస్కృతిక, సాహితీ పత్రికను ప్రారంభించాడు. తెలుగు సాహితీప్రియులకు ఇది చాలాకాలం అభిమాన పత్రికగా నిలచింది.
నాగేశ్వరరావు అసమాణ దానశీలి. ఆయన ఇల్లు ఎప్పుడూ అతిధులతోనూ, అర్ధులతోనూ కళకళలాడుతుండేది. వివిధ సేవఅ కలాపాలకు ధారాళంగా ఆయన సహాయం చేస్తుండేవాడు. ఆయన ఇంటినుండి వట్టిచేతులతో ఎవరూ వెళ్ళేవారు కాదు. ఆయన దాతృత్వానికి అబ్బురపడి మహాత్మా గాంధీ ఆయనను విశ్వదాత అని కొనియాడాడు.
మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి అరంభదశనుండి నాయకులుగా ఉన్నవారిలో నాగేశ్వరరావు ఒకడు. ఈ విషయమై తన పత్రికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. ఈ విషయంలోనూ, తెలుగు భాష, సంస్కృతిలకు సంబంధించిన ఇతర విషయాలలోనూ ఆయన తెలుగు జాతికి చేసిన సేవను గౌరవిస్తూ తెలుగువారు ఆయనను దేశోధ్ధారక అని సత్కరించారు.
టంగుటూరి ప్రకాశం సమకాలీనుడైన నాగేశ్వరరావు 1924 - 1934 మధ్యకాలంలో నాలుగు సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఉన్నాడు. ముఖ్యంగా ఖద్దరు ఉద్యమానికి నాగేశ్వరరావు బలమైన మద్దతును, సహకారాన్ని అందించాడు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో చురుకుగా పాల్గొన్న నాయకులలో ఆయన ఒకడు. నాగేశ్వరరావుపై ప్రజలకు ఎంతో అభిమానం, నమ్మకం ఉండేవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి