31, జులై 2014, గురువారం

దాశరథి కృష్ణమాచార్య --- నా తెలంగాణ కోటి రతనాల వీణ




తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించిన కవి దాశరథి.
కోటి తెలంగాణ ప్రజల ఏకైక మహాకంఠవీణాధ్వని వినాలంటే దాశరథి కావ్యగానం వినాలి.
    నా తెలంగాణ, కోటిరత్నాల వీణ
అని కంఠమెత్తి దాశరథి పాడుతున్నప్పుడు తెలంగాణ మహాప్రజ సముద్ర జలాల మాదిరి కరుళ్లెత్తి పొంగి వస్తుంది.
దాశరథి గీతాలు వినని రసికులు తెలంగాణ మందుండరు.
దాశరథిని ప్రేమించని సాహిత్యికులు తెలంగాణలో లేరు.
దాశరథిచే స్వీకరింపబడని కావ్యవస్తువు తెలంగాణలో లేదు.
దాశరథియే తెలంగాణము, తెలంగాణమే దాశరథి.
ఆయన గీతములు మహానగరముల నుండి పల్లెపట్టులదాకా, శిథిలాలయముల నుండి జైళ్లలో దాకా, ధనికునినుండి పేదవాని దాకా, మితవాదినుండి తీవ్రవాది దాకా, ప్రసరించినవి.
దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఈ గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బియ్యే చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ అభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నారు.
ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసారు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసారు.
నా పేరు ప్రజాకోటి 
నా ఊరు ప్రజావాటి…. అంటు తెలంగాణ ప్రజల హృదయతంత్రులను మీటి ,వారిని జాగృతం చేసిన ప్రళయకవితామూర్తి.

నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయారు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించారు.
రైతుదే తెలంగాణము రైతుదే.ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించారు.
దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోవోయ్
అని నిజాము ను సూటిగా గద్దిస్తూ రచనలు చేసారు.
నిజాం ప్రభువుకి వ్యతిరేకంగా గొంతెత్తి
ఓ నిజాము పిశాచమా కానరాడు
నిన్నుబోలినరాజు మాకెన్నడేని
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాలవీణ అని ఎలుగెత్తి సభలలో వినిపించారు.
భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా సాగుతున్న కాలంలోనే,తెలంగాణలో కూడా నిజాం వ్యతిరేక ఉద్యమం జరుగుతుంది.1947లో భారతావనికి స్వాతంత్ర్యం సిద్దించింది.కాని తెలంగాణకు మాత్రం నిజాం నవాబుల పాలన నుంచి విముక్తి లభించలేదు.నిజాం పాలనలో ప్రజలు దుర్భర జీవితాలను గడిపే వారు.
నిజాం నిరంకుశ పరిపాలనలో ప్రజలకు ఎలంటి స్వేచ్ఛఉండేది కాదు.ప్రజలు తమ మనసులోని కోర్కేలను తెలుపుకొనుటకు గాని,సభలు ఏర్పాటుచేసి తమ కష్టాలను,బాధలను చేప్పుకోవడానికి వీలుండెది కాదు.ప్రజలపై అధికపన్నులు విధించడం,వారి భూములను లాక్కోవడం, వారిని నానా రకాలుగా బాధించే వారు. రజాకార్లు ప్రజల పాలిట నరభక్షకుల్ల తయారయ్యారు. వీరు ఇండ్లపై పడి ప్రజల్ని ఊచకోతకోసేవారు. ఆడవారిని ఎత్తుకెల్లి మానభంగం చేసెవారు.
విధంగా తెలంగాణ ప్రజలు నిజాం నవాబుల పరిపాలనలో స్వేచ్ఛా,స్వాతంత్ర్యాలు లేకుండా జీవచ్చవాల్లా బ్రతికేవారు. ఇలా వీరి మతోన్మాద, కిరాతక, నియంతృత్వ, నిరంకుశ పాలనను ఎదిరించి నిజాం నవాబుకు సింహస్వప్నమై నిలిచి
ప్రాణము లొడ్డి ఘోర గహనాటవులన్ బడగొట్టి మంచి మా
గాణములన్ స్రుజించి ఎముకల్ నుసిజేసి పొలాలు దున్ని భో
షాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే, తెలం
గాణము రైతుదే; ముసలి నక్కకు రాచరికంబు దక్కునే? అని గర్జించారు.
దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు,
దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది,
దిగిపోవోయ్, తెగిపోనోయ్  అని నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేసారు.
నిజాం నిరంకుశత్యాన్ని,ఆగడాలను ఖండిస్తు…..
అదె తెలంగాణలోన దావాగ్ని లేచి
చుట్టుముట్టిన భయద సంక్షోభ వేళ
అది నిజాము నృపాలుని అండదండ 
చూచుకొని నిక్కినట్టి పిశాచహేల
నాడు మానవతీ నయనమ్ములందు
నాగ సర్పాలు బుసకొట్టి నాత్యమాడె
నాడు మానవతయు నవనాగరకత
తన్నులెన్నది రాక్షసర్వమ్ముచేత
అంటు ఈ పద్యంలో నాడు మానవతీ నయనమ్ములందు, నాగ సర్పాలు బుసకొట్టి నాట్యమాడెఅన్నారు.నిజాం అనుచరుల అత్యాచారాలకు బలైన స్త్రీలు తీవ్రమైన కక్షతో అక్షుల్ని (కన్నుల్ని)కలిగి ఉన్నారు. స ర్పాలలో నాగుపాము కక్షా తత్వానికి పరాకాష్ఠ. అందుకే అతివల నయనాల్లోని ,కక్షా తత్వమంతా నాగసర్పాలుగా బుసకొడుతున్నదని,స్త్రీల హృదయాల్లోని ఉద్విగ్నబాధను కవి పై పంక్తుల్లో వివరించారు.
 
ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించారు. నిజామాబాదు లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది, నిజాము ప్రభుత్వం. ఆయనతోపాటు ఖైదులో వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నారు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నారు. మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకరు. 1953 లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసారు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెల్చుకున్నారు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నారు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించారు.
1987 నవంబరు 5 న దాశరథి మరణించారు.

రచనలు

కవితా సంపుటాలు

    • అగ్నిధార
    • మహాంధ్రోదయం
    • రుద్రవీణ
    • మార్పు నా తీర్పు
    • ఆలోచనాలోచనాలు
    • ధ్వజమెత్తిన ప్రజ
    • కవితా పుష్పకం: ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
    • తిమిరంతో సమరం: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత

1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా..
ఆంధ్ర రాష్ట్రము వచ్చె
మహాంధ్ర రాష్ట్రమేరుపడువేళ
పొలిమేర చేరపిలిచె

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి