21, అక్టోబర్ 2014, మంగళవారం

విద్వాన్‌ విశ్వం



విద్వాన్విశ్వం (21 అక్టోబర్ 1915  -  19 అక్టోబర్ 1987 ) గా చిరపరచితుడైన మీసరగండ విశ్వరూపాచారి విద్వాంసులకు విద్వాంసుడుగా పలువురి ప్రశంసలు పొందినవాడు. తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు విశ్వం .

విద్వాన్ విశ్వం గురించి తరానికి పెద్దగా తెలియక పోవచ్చు. కొందరు సాహితీకారులు ఆయన రచనల్ను కొంతమేరకు చదివి ఉండొచ్చు. అయితే నిన్నటి తరం రచయితలు, పాఠకులు మాత్రం ఆయనను ఆదర్శ రచయితగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప మానవతావాదిగా కీర్తిస్తారు. వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను పట్టించుకోకుండా సమాజానికి తన వంతు సేవ చేస్తూ, సాహితీకారుడిగా, పత్రికా రచయితగా, ప్రచురణకర్తగా, సంపాదకునిగా రాణించడం సామాన్య విషయం కాదు. పనిని విద్వాన్ విశ్వం సమర్థవంతంగా నిర్వర్తించారు,

తెలుగునాట విద్వాన్విశ్వం గారిది ప్రత్యేక స్థానం. వీరి జీవితంలో ఉద్యమం, సాహిత్యం, జర్నలిజం ముప్పేటగా కలిసిపోయాయి. ప్రాకృతం, సంస్కృతం, ఆంగ్ల భాషలను ఆకళింపు చేసుకున్న పాండిత్యం ఆయన సొంతం. వామపక్ష ఆలోచనలనూ, భారతీయ లోచనాన్నీ కలిపి చూసిన సమన్వయవాది విశ్వం.

ఛాందసమెరుగని సంప్రదాయవాది,

ఆవేశంలేని ఆధునికవాది,

మనసున్న మానవతావాది విశ్వం.

విద్వాన్విశ్వం అనగానే చాలామందికి మాణిక్యవీణ కాలమ్గుర్తుకువస్తుంది. అలాగే ఎంతోమందికి పెన్నేటిపాట, ఒకనాడు కావ్యాలు స్ఫురించవచ్చు. ఇంకొందరికి బాణుభట్టు కాదంబరి, కాళిదాసు మేఘసందేశం అనువాదాలు స్ఫురణకు రావచ్చు. అయినా, ఆంద్రప్రభ సచిత్ర వార పత్రిక సంపాదకుడిగానే ఆయన సుప్రసిద్ధులు. విద్వాన్విశ్వం మొదట సంస్కృత ప్రాకృతాలను లోతుగా అధ్యయనం చేసి తర్వాత ఉపాధ్యాయుడుగా స్థిరపడకుండా, రాజకీయ ప్రవేశం చేసి అటు తర్వాత పాత్రికేయుడుగా సంపాదకుడుగా మన్నన పొందారు.
దాశరధి గారికి తెలంగాణమంటే ప్రాణం లేచి వచ్చినట్టు విశ్వం గారికి రాయలసీమ అంటే పంచప్రాణాలు. భాష గురించి, వ్యక్తీకరణ గురించి, మాండలిక పద ప్రయోగం గురించి చర్చిస్తున్నప్పుడు ఆయన తప్పకుండా రాయలసీమ ప్రాంతపు పలుకుబడుల గురించి వివరిస్తారు. తెలుపు-నలుపు శీర్షికలో విశ్వం భాష గురించి, పలుకుబడుల గురించి చేసిన చర్చ అప్పట్లో సాహిత్యవేత్తల్లో గొప్ప ఆసక్తిని రేపింది.
రాయలసీమ గత వైభవానికి గర్విస్తూ దాన్నే స్తుతిస్తూ ఆగిపోలేదు విద్వాన్విశ్వం. విశ్వానికివల్లంపాటి వెంకట సుబ్బయ్య వ్యాఖ్యానించినట్టు కీర్తి పట్ల పలవరింతగానీ, వెర్రి వ్యామోహం కానీ లేవు. అందుకే, పెన్నేటి పాటలో ఇలా అంటారు
ఇది గతించిన కథ; వినిపింతునింక
నేటి రాయలసీమ కన్నీటి పాట
కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు
కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు      అని చాలా వాస్తవిక చిత్రాన్ని పాఠకులకు అందిస్తారు.
స్థూలంగా పరిశీలిస్తే మాత్రా చందస్సు, సూక్ష్మంగా గమనిస్తే పద్యం సొగసు కనబడడం పెన్నేటిపాట గొప్పదనం. నిజానికి పద్యానికి మాత్రా ఛందస్సు జోడించి కవి కొత్తబాట వేశారు. తిప్పతీగె, రేణుగంప, తుమ్మతోపు, చిట్గీత, తంగేడు, పల్లేరు గాయలు, గూబమూల్గు తీతువు, పాపరకాయలు వంటి పద ప్రయోగాలతో పూర్తి సజీవ చిత్రణతో విశ్వం కవిత సాగుతుంది. చాలా సాధారణమైన పదాలు పద్యంలో చేరి అలవోకగా కలిసిపోతాయి.

1915, అక్టోబర్ 21 అనంతపురం జిల్లా లో తరిమెల గ్రామంలో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి మీసరగండ మునిరామాచార్యులు. విశ్వం స్వగ్రామంలో చిన్నతనంలో రామాయణం శంకరశాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో కర్నూలు,ప్రొద్దుటూరు లలో సంస్కృత కావ్య నాటకాలంకారాలను, తర్కశాస్త్రాన్ని ఆభ్యసించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలోనూ, ఆంధ్రంలోనూ విద్వాన్ పట్టాపుచ్చుకున్నారు. అనంతపురంలో చిలుకూరు నారాయణరావు వద్ద శిష్యరికం చేశారు. కాశీ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తూ అనారోగ్యం వలన పూర్తి చేయలేకపోయారు.

బెనారస్నుండి అనంతపురం తిరిగిరాగానే తరిమెల నాగిరెడ్డితో కలిసి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు. ప్రజలను చైతన్యపరచటానికి గ్రంథ ప్రచురణ అవసరమని భావించి నవ్యసాహిత్యమాల అనే ప్రచురణ సంస్థ ఏర్పాటు చేసి నవ్యసాహితి అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. ఫాసిజం మొదలైన అంశాలపై పుస్తకాలను ప్రచురించారు. దానితో బ్రిటీష్ ప్రభుత్వం రాజద్రోహం క్రింద తరిమెల నాగిరెడ్డిని, విద్వాన్ విశాన్ని అరెస్టు చేసి మొదట బళ్ళారిలోని అల్లీపూర్ జైల్లోనూ తర్వాత తిరుచిరాపల్లి జైలు లోనూ నిర్భందించింది. తిరుచిరాపల్లి జైలులో విశ్వం బెజవాడ గోపాలరెడ్డి వద్ద బెంగాలీ నేర్చుకున్నారు. జైలులో రాజాజీ, టంగుటూరి ప్రకాశం వంటి నాయకుల సాహచర్యం లభించింది. ఈయన అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, రాయలసీమ కాంగ్రెస్ కమిటీ కార్యాలయ కార్యదర్శిగా, అనంతపురం జిల్లా జాతీయసభకు, జిల్లా లోకజనసంఘానికి, మండల క్షామనివారణ సభకు,జిల్లా ఆంధ్రమహాసభకు ప్రధాన కార్యదర్శిగా,జిల్లా రైతు మహాసభకు ఉపాధ్యక్షుడుగా పనిచేశారు.

ఉద్యమం, ఉపన్యాసం మాత్రమే కాకుండా మరింత లోతుగా రాజకీయాలు శాస్త్రపద్ధతిలో వివరించడానికి పత్రికారంగం వైపు దృష్టి సారించారు. అడివి బాపిరాజు ఆహ్వానించడంతో మీజాన్ పత్రికలో 1945లో అసిస్టెంట్ ఎడిటర్గా చేరి కొంతకాలం పనిచేశారు. తరువాత విజయవాడలో ప్రజాశక్తి దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్గా సుమారు మూడు సంవత్సరాలు పనిచేశారు. "మీజాన్" పత్రికలో రచనావ్యాసంగం, "ప్రజాశక్తి"లో సంపాదకత్వం పాండితీభాషలోనే సులభశైలిని సాధించగలిగినా, పరిపాలనాయంత్రాంగపు నిర్బంధాలకు గురయ్యారు. తర్వాత మద్రాసుకు తరలివెళ్ళి అక్కడ బాలభారత్ విద్యాలయంలో సంపాదకుడిగా కొన్నాళ్ళు పనిచేశారు. 1952 ఆగష్టు 15 ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక ప్రారంభమైనపుడు దానిలో ఎడిటర్ ఇన్చార్జ్గా చేరి 1959 వరకు పనిచేశారు. 1959లో ఆంధ్రపత్రిక దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్గా కొంతకాలం పనిచేసి 1960లో విజయవాడకు వచ్చి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అసోసియేట్ ఎడిటర్గా పనిచేశారు. మళ్ళీ 1963లో ఆంధ్రప్రభ దినపత్రికకు అసోసియేట్ ఎడిటర్చేరారు. 1967లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికకు సంపాదకుడిగా మారారు. ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో పదవీవిరమణ చేసిన తరువాత 1981నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ప్రధాన సంపాదకునిగా వ్యవహరించారు. సమయంలో విశ్వం కథాసరిత్సాగరంను 12 సంపుటాలుగా తెనుగించారు. "చందమామ"లో ద్విపద కావ్యం రూపంలో వ్రాసిన పంచతంత్ర కథలను బాపు బొమ్మలతో తి.తి.దే.ప్రచురణగా వెలువరించారు. బ్రహ్మసూత్రాలు శంకరభాష్యం నాలుగు సంపుటాలను, అధర్వణ వేదాన్ని అనువాదం చేసి ప్రచురించారు. 1987 అక్టోబర్ 19వతేదీ తనువు చాలించారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి