28, జూన్ 2014, శనివారం

కొప్పరపు సోదర కవులు ----"కవిత పుట్టిల్లు సోదర కవుల యిల్లు" అనే ఖ్యాతిపొందారు.



కొప్పరపు సోదర కవులు తెలుగు సాహిత్య అవధానం లో ప్రసిద్ధిచెందిన జంట సోదర కవులు. వీరు ప్రకాశం జిల్లా (పూర్వం గుంటూరు జిల్లా) అద్దంకి తాలూకా కొప్పరం గ్రామంలో వేంకటరాయలు మరియు సుబ్బమాంబ దంపతులకు జన్మించారు. వీరిలో పెద్దవాడు కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి (జ. నవంబరు 12, 1885 - మార్చి 29, 1932) మరియు రెండవవాడు కొప్పరపు వేంకటరమణ కవి (జ. డిసెంబరు 30, 1887 - మార్చి 21, 1942). వీరి గురువులు రామడుగు కృష్ణశాస్త్రి మరియు పోతరాజు రామకవి. ఈ సోదరులిరువురు పదహారేళ్ళు నిండకనే ఆశుకవిత్వాన్ని ప్రదర్శించి కొప్పరపు సోదర కవులుగా పేరుపొందారు.
కొప్పరపు సోదర కవులు 1908 మొదలుకొని అసంఖ్యాకంగా అష్టావధానాలు చేసి "కవిత పుట్టిల్లు సోదర కవుల యిల్లు" అనే ఖ్యాతిపొందారు. వీరు లక్కవరం, గద్వాల, చల్లపల్లి వంటి సంస్థానాలలో 150 సభలలో అష్టావధాన, శతావధాన, ఆశుకవితా ప్రదర్శనలిచ్చారు. వీరి మొదటి ఆశుకవిత్వ సభ అల్వాలు లష్కరు లో ఆదిరాజు తిరుమల రావు వీరికి ముంగాలి అందె ను బహూకరించారు. వీరు చెన్నపురి, బాపట్ల, విశదల, చీరాల, గుంటూరు, పంగిడిగూడెం, హైదరాబాదు లలో చేసిన శతావధానాలు ప్రఖ్యాతమైనవి. వీరు ప్రబంధ శైలిలో గంటకు 500 పద్యాలు చెప్పేవారు. మార్టేరు సభలో పందెం వేసి గంటకు 720 పద్యాల లెక్కన అరగంటలో మను చరిత్ర ను ఆశువుగా చెప్పినట్లు తెలుసున్నది.
వీరికి బాల సరస్వతి, ఆశు కవీంద్ర సింహ, విజయ ఘంటికా, ఆశుకవి చక్రవర్తి, కుండినకవి హంస, కవిరత్న, అవధాన పంచానన, కథాశుకవీశ్వర, ఆశుకవి శిఖామణి మొదలైన బిరుదులు ఉన్నవి.
వేదము వేంకటరాయ శాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు, వావిలికొలను సుబ్బారావు, వసురాయ కవీంద్రుడు , కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునీంద్రులు, కాళ్లకూరి నారాయణరావు, జయంతి రామయ్య పంతులు మొదలైన అనేక ప్రసిద్ధాంధ్ర సంస్కృత పండితులు కొప్పరపు సోదర కవుల అవధాన కవితా సరస్వతిని తిలకించి హారతిపట్టారు.
కొప్పరపు సోదర కవుల పూర్వ వంశీయులలో కామరాజ కవి జాంబవతీ పరిణయము ను మరియు వేంకటరత్న కవి శాంభవీ శతకం మరియు రామ దండకం లను రచించారు.
వేంకట సుబ్బరాయశర్మ మరణం తర్వాత వేంకటరమణ కవి తమ అనుంగు సోదరుడైన కొప్పరపు బుచ్చిరామ కవి (డిసెంబరు 9, 1892 - మే 29, 1956) తో కలిసి ఆశుకవితా సభలు చేశాడు. వీరు అవధానాలలో కొన్ని లక్షల పద్యాలు చెప్పారు.
వేంకట సుబ్బరాయకవి గారి కుమారుడు కొప్పరపు సీతారామ ప్రసాదరావు అవధానాశు కవితా ప్రదర్శనలిచ్చి ప్రసిద్ధిచెందారు. వేంకటరమణకవి కుమారుడు మల్లికార్జునరావు, సీతారామ ప్రసాదరావు తో కలిసి సభలలో పాల్గొని అల్పవయస్సులోనే మరణించారు.
వీరి మద్రాసు మరియు గుంటూరు సభలను గురించి చిరుమామిళ్ల లక్ష్మీనారాయణ ప్రసాదు , కాకినాడ సభలను గురించి చేగంటి బాపిరాజు సేకరించి 1911 ప్రాంతంలో ప్రచురించారు. వీరి ఈ రెండు సంకలనములను మరికొన్ని అవధానాశు కవితా పద్యాలను కలిపి కుంటముక్కల జానకీరామశర్మ 1963 సంవత్సరంలో "కొప్పరపు కవుల యశోడిండిమ" అనే పేరుతో రెండు సంపుటాలుగా మకర సంక్రాంతి పర్వదినాన ప్రచురించాడు. వీరి జీవితచరిత్రను నిడదవోలు వెంకటరావు 1973 సంవత్సరంలో రచించారు.

రచనలు

  • కనకాంగి
  • పసుమర్తి వారి వంశావళి (1909)
  • జ్ఞానోపదేశము
  • నారాయణాస్త్రము
  • సుబ్బరాయ శతకము (1936)
  • కృష్ణకరుణా ప్రభావము
  • దైవ సంకల్పము (1913)
  • దీక్షితస్తోత్రము (1916)
  • శతావధానము (1911)
మహాపండితులైన వీరి జ్ఞాపకార్థం "శ్రీ కొప్పరపు కవుల కళాపీఠము" పేరుతో సెప్టెంబరు 9, 2002 సంవత్సరంలో వీరి దౌహిత్రుడు మాచవరం వేంకట చెంచురామ మారుతి సుబ్బరాయశర్మ (మా. శర్మ) విశాఖపట్టణం లో స్థాపించారు. ఈ సంస్థ ద్వారా 2003 సంవత్సరంలో "కొప్పరపు సోదర కవులు" మరియు 2004 సంవత్సరంలో "కొప్పరపు సోదర కవుల కవిత్వము" అనే గ్రంథాలను డా. గుండవరపు లక్ష్మీనారాయ ప్రచురించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి