
ఆచార్య ఎన్.జి.రంగా గా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు (నవంబరు 7 , 1900
- జూన్ 9 , 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు
రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ
ఉద్యమపితగా భావిస్తారు. దేశంలో
సుదీర్ఘకాలం పార్లమెంట్ సభ్యునిగా పనిచేసి, ఎటువంటి పదవి ఆశించకుండా రైతులు
ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన తుది శ్వాస విడిచేంత వరకు
అవిశ్రాంత పోరాటం జరిపిన మహౌన్నతుడు ఆచార్య ఎన్.జి.రంగా, రైతుల పక్షాన
చట్టసభలలో తన వాణిని వినిపించి, పాలక పక్షాలు వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను
గుర్తించే విధంగా ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. ఆయన చేనేత కార్మికుల,
వ్యవసాయ కూలీల జీవితాలలో వెలుగులు నింపడానికి ఆవిరళ కృషి సల్పారు. దేశంలో
రైతాంగ ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచి, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు
పరిష్కారం అయ్యేలా విశేషంగా ప్రయత్నించారు. దేశంలో తొలిసారిగా వ్యవసాయ
రుణాలపై మారటోరియం ప్రకటించడానికి ఆద్యుడు ఎన్.జి.రంగానే. రంగా గుంటూరు
జిల్లా నిడుబ్రోలు లో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకుజన్మించారు.
నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్
కళాశాల నుండి పట్టభద్రుడైనారు. 1926 లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము నుండి
ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశాని కి తిరిగివచ్చిన తర్వాత మద్రాసు
లోని పచ్చయప్ప కళాశాల లో ఆర్ధిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని
ప్రారంభించారు. ఇతడు హేతువాది .1924లో భారతీదేవితో రంగా వివాహం
జరిగింది.నిడుబ్రోలులో రామనీడు పేరుతో రాజకీయ పాఠశాలను ఏర్పాటు
చేసారు.1933వ సం.లో రంగా స్ధాపించిన రాజకీయ విద్యాలయాన్ని మహాత్మాగాంధి
ప్రారంభించారు. రాష్ట్రం, దేశం నుంచి విద్యాలయానికి విచ్చేసి రాజకీయంగా
ఓనమాలు నేర్చుకున్న నాయకులు ఎందరో సమర్ధులైన నాయకులుగా పేరు ప్రఖ్యాతులు
గడించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా,
మంత్రులుగా, ఎమ్మెల్యే పదవులను చేపట్టి రాణించారు. కొణిజేటి రోశయ్య కూడా
రంగా శిష్యుడే. ఈ పాఠశాల స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో
కొనసాగుతుంది. రంగా సుదీర్ఘ కాలం పార్లమెంట్ సభ్యునిగా రికార్డు
సృష్టించి,గిన్నీస్ బుక్లోకి ఎక్కారు. చిత్తూరు, శ్రీకాళహస్తి, గుంటూరు
లోక్సభ నియోజక వర్గాల నుంచి ఎన్నికై ఆయన ప్రాతినిధ్యం వహించారు.1927లో మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో ఆర్ధిక శాస్త్ర అధ్యాపకునిగా, అనంతరం మద్రాసు ప్రభుత్వ ఆర్ధిక సలహాదారునిగా కొంత కాలం పనిచేశారు. 1930లో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్లతో సన్నిహితంగా మెలుగుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో విజృంభించారు. 1931లో భూమి శిస్తుకు వ్యతిరేకంగా ఉద్యమించిన రంగాను బ్రిటీషు ప్రభుత్వం అరెస్టు చేసింది. అరెస్టులకు బెదరని రంగా రైతుల దుర్భర పరిస్ధితులకు వ్యతిరేకంగా రైతు రుణ విముక్తి ఉద్యమాన్ని ప్రారంభించి, జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమ ఫలితంగానే బ్రిటీష్ ప్రభుత్వం ఆనాడు రైతుల రుణాలపై మారటోరియంను ప్రకటించింది. అప్పటి నుంచి రైతు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ రంగా ప్రత్యక్షమై ఉద్యమాలను నిర్వహించేవారు. యువతకు రాజకీయాలు నేర్పడానికి పాఠశాలను స్ధాపించిన ఘనత ఆచార్య ఎన్.జి.రంగాకే దక్కింది
1930 లో మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి, రంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. 1933 లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించారు. మూడు సంవత్సరాల తర్వాత కిసాన్ కాంగ్రెసు పార్టీని స్థాపించారు. రైతుకూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపారు. ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై బాపు దీవెనలు అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించారు.రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకరు. 1946 లో కోపెన్హేగెన్ లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సులో, 1948 లో శాన్ ఫ్రాన్సిస్కో లో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోనూ, 1952 లో ఒట్టావా లో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954 లో న్యూయార్కు లో జరిగిన ఇంటర్నేషనల్ పెజెంట్ యూనియన్ లోనూ మరియు 1955 లో టోక్యో లో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంటులోను భారతదేశం తరఫున ప్రతినిధిగా పాల్గొన్నారు.ఈయన కాంగ్రెసు పార్టీ నుండి నిష్క్రమించి భారత కృషీకార్ లోక్ పార్టీ , ఆ తరువాత సహకారరంగ వ్యవసాయానికి బద్ధవ్యతిరేకి అయిన రాజాజీ తో కలిసి స్వతంత్ర పార్టీ ని స్థాపించారు. రంగా స్వతంత్ర పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడై ఆ పదవిని ఒక దశాబ్దంపాటు నిర్వహించారు. 1962 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 25 స్థానాలలో గెలిచి, బలమైన ప్రతిపక్షముగా రూపుదిద్దుకొన్నది. 1972లో రంగా తిరిగి కాంగ్రెసు(ఐ)లో చేరారు.
95 సంవత్సరాల వయస్సులో ఆయన అనారోగ్యంతో 1995 జూన్ 8వతేదీన నిడుబ్రోలులోని ఆయన స్వగృహమైన గోభూమిలో తుదిశ్వాస విడిచారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి