


సుభాష్ చంద్రబోస్ 1897 లో, భారత దేశంలోని ఒరిస్సా లోని కటక్ పట్టణం లో జన్మించారు. అతని తండ్రి జానకినాథ్ బోస్ లాయరు. తీవ్రమైన జాతీయవాది. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి కూడా ఎన్నికయ్యారు. బోస్ విద్యాభ్యాసం కటక్లోని రావెన్షా కాలేజియేట్ స్కూలులోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజిలోను, ఫిట్జ్ విలియమ్ కాలేజిలోను, ఆపై కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం లోను సాగింది.
1920 లో బోస్ భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై అందులో నాలుగవ ర్యాంకులో నిలిచారు. ఇంగ్లీషులో అత్యధిక మార్కులు సాధించారు. అయినా 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుండి వైదొలగి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొననారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించ సాగారు.
సహాయ నిరాకరణోద్యమం సమయంలో మహాత్మా గాంధీ బోస్ను కలకత్తా పంపారు. అక్కడ చిత్తరంజన్ దాస్ తో కలసి బోస్ బెంగాల్లో ఉద్యమం నిర్వహించారు. 1921లో వేల్స్ యువరాజు పర్యటన సందర్భంగా నిరసన ప్రదర్శనలు చేసినందుకు గాను బోస్కు కారాగార శిక్ష విధించారు. 1924 ఏప్రిల్లో క్రొత్తగా ఏర్పడిన "కలకత్తా కార్పొరేషన్" ముఖ్యనిర్వహణాధికారిగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం అక్టోబర్లో ఉగ్రవాదం అనుమానంపై బోస్ను అరెస్టు చేసి అలీపూర్ జైలులో ఉంచారు. తరువాత బర్మాలోని మాండలే జైలుకు పంపారు. మళ్ళీ 1930 జనవరి 23న స్వతంత్ర ప్రదర్శనను నిర్వహించినందుకు అరెస్టు చేశారు. విడుదలైన తరువాత కలకత్తా నగరం మేయర్గా ఎన్నికయ్యారు. మొత్తానికి 20 సంవత్సరాల వ్వవధిలో బోస్ 11 సార్లు జైలు పాలయ్యారు. 1930 దశకం మధ్యలో భారతదేశంనుండి బహిష్కృతుడయ్యారు. అప్పుడు బోస్ ఐరోపాలో విస్తృతంగా పర్యటించారు. ఎందరో మేధావులను, నాయకులను కలిశారు. భారత దేశం స్వాతంత్ర్యం గురించి చాలా వేదికలలో ప్రసంగించారు. మధ్యలో తన తండ్రి అంత్య క్రియలకు మాత్రం భారతదేశం వచ్చి వెళ్ళడానికి బోస్కు అనుమతి లభించింది.
ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ ఆలోచనలలో క్రొత్త భావాలు చోటు చేసుకొన్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికీ, మనడానికీ భారత దేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సమర్ధన, ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించారు. 1937 డిసెంబరు 26న బోస్ ఎమిలీ షెంకెల్ అనే తన సెక్రటరీని వివాహం చేసుకొన్నారు. ఈమె ఆస్ట్రియా లో జన్మించింది. వారికి 1942 లో పుట్టిన కూతురు పేరు అనిత.
1938లో, గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా, బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. బోస్ ప్రత్యర్ధి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించారు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్నుండి వైదొలగారు. వేరు మార్గం లేని బోస్ "అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్" పార్టీని స్థాపించారు. 1938లో "జాతీయ ప్రణాళికా కమిటీఅనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికారు.
బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరినాక దేశానికి స్వతంత్రం ఇస్తారని గాంధీ, నెహ్రూ వంటి నాయకులు భావించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో తల మునకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకొని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని బోస్ బలంగా వాదించారు. స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశం ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్ నాయకత్వంలోని టర్కీ దేశం లాగా కనీసం రెండు దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా బోస్ అభిప్రాయం. ఈ సమయంలో బోస్ అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకొన్నారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ నాయకులెవరూ బోస్తో సమావాశానికి అంగీకరించలేదు. తరువాత కాలంలో అట్లీ నాయకత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వం కాలంలోనే భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది గమనించవలసిన విషయం.
బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా, కాంగ్రెస్ను సంప్రదించకుండా భారతదేశం తరఫున యుద్ధాన్ని ప్రకటించింది. కనుక బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో ఈ నిర్ణయం పట్ల బోసు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు ప్రాంభించారు. వెంటనే బ్రిటిషు ప్రభుత్వం అతనిని జైలులో పెట్టింది. 7 రోజుల నిరాహార దీక్ష తరువాత విడుదల చేసింది. కాని అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది. ఇక అప్పట్లో తనను దేశం వదలి వెళ్ళనివ్వరని గ్రహించిన బోస్ 1941 జనవరి 19న, ఒక పఠాన్ లాగా వేషం వేసుకొని తన మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్ తోడుగా ఇంటినుండి తప్పించుకొన్నారు. ముందుగా పెషావర్ చేరుకొన్నారు. అక్కడ అతనికి అక్బర్ షా, మొహమ్మద్ షా, భగత్ రామ్ తల్వార్లతో పరిచయమైంది. 1941 జనవరి 26న, గెడ్డం పెంచుకొని, ఒక మూగ, చెవిటి వాడిలాగా నటిస్తూ, ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతం ద్వారా, మియాఁ అక్బర్ షా , అగాఖాన్ల సహకారంతో ఆఫ్ఘనిస్తాన్ లోంచి కాబూల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నారు. రష్యాకు బ్రిటన్తో ఉన్న వైరం వల్ల తనకు ఆదరణ లభిస్తుందనుకొన్న బోస్కు నిరాశ ఎదురైంది. రష్యాలో ప్రవేశించగానే NKVDఅతనిని మాస్కోకు పంపింది. వారు అతనిని జర్మనీ రాయబారి షూలెన్బర్గ్ కి అప్పగించారు. అతను బోస్ను బెర్లిన్ పంపారు. అక్కడ బోస్కు రిబ్బెన్ట్రాప్ నుండి, మరియు విల్హెల్మ్స్ట్రాస్ లోని విదేశీ వ్యవహారాల శాఖాధికారులనుండి కొంత సఖ్యత లభించింది.
తమ శత్రువుల కూటమి అయిన అగ్ర రాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకొన్నాడని తెలియగానే అతనిని, జర్మనీ చేరకముందే, హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్లను నియమించింది. బ్రిటిష్ గూఢచారి దళానికి చెందిన ఈ పనిని చేపట్టింది.
ఇలా భారత దేశంనుండి ఆఫ్ఘనిస్తాన్,అక్కడినుండి రష్యా, అక్కడినుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకొన్న బోస్ జర్మనుల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో మొదలుపెట్టి ప్రసారాలు మొదలుపెట్టాడు. బెర్లిన్లో "స్వతంత్ర భారత కేంద్రం" (Free India Centre) స్థాపించారు. ఉత్తర ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి, అగ్రరాజ్యాలకు బందీలైన 4500 భారతీయ సైనికులతో ఇండియన్ లెజియన్ ప్రారంభించారు. తరువాత జపాన్ వారి సహకారంతో సింగపూర్ లో తన భారత జాతీయ సైన్యాన్ని బలపరచుకొన్నారు.
భారత జాతీయ సైన్యాన్ని మోహన్ సింగ్ దేవ్ సెప్టెంబర్ 1942 తేదీన సింగపూర్ లో స్థాపించారు. ఇది రాష్ బిహారీ బోస్ స్థాపించిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ తరహాలోనిది. అయితే జపాన్ హై కమాండ్ కు చెందిన హికారీ కికాన్ కు మోహన్ సింగ్ కు భేదాలు రావడం వల్లనూ మరియు మోహన్ సింగ్ దీన్ని జపానీయులు కేవలం పావుగా వాడుకుంటున్నారని భావించడం వల్లనూ disband చేశారు. మోహన్ సింగ్ ను అదుపు లోకి తీసుకున్నారు. బలగాలను యుద్ధ ఖైదీలుగా జైలుకు పంపించారు. 1943లో సుభాష్ చంద్ర బోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు కొత్త ఊపిరులూదినట్లైంది. అదే సంవత్సరంలో జూలై లో సింగపూర్ లో జరిగిన మీటింగ్ లో రాష్ బిహారీ బోస్ సుభాష్ చంద్రబోస్ కు సంస్థ పగ్గాలు అప్పగించారు. బోస్ పిలుపుతో చాలా మంది దేశ భక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సహాయం కూడా అందించారు.
మిలిటరీ నుంచి వ్యతిరేకత ఎదురైనా బోస్ అజాద్ హింద్ విప్లవాన్ని సమర్థించుకోవడాన్ని మానలేదు. జులై 4, 1944 లో బర్మా లో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీ లో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజ పూరితమైనవి. వీటిలో చాలా ప్రసిద్ధి గాంచినది.
“ మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను ”
ఈ ర్యాలీలో భారత ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో తమతో పాటు చేరమని పిలుపునిచ్చారు. హిందీలో సాగిన ఈ ప్రసంగం ఆద్యంతం ఉత్తేజ భరితంగా సాగింది.
ఈ సైన్యంలోని దళాలు ఆజాద్ హింద్ ప్రభుత్వాధీనంలో ఉండేవి. ఈ ప్రభుత్వం తానే స్వంతంగా కరెన్సీ, తపాలా బిళ్ళలు, న్యాయ మరియు పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అగ్ర రాజ్యాలైన జర్మనీ, జపాన్,ఇటలీ, క్రొయేషియా,థాయ్లాండ్, బర్మా , ఫిలిప్ఫీన్స్ లాంటి దేశాలు కూడా ఆమోదించాయి. ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా రష్యా, సంయుక్త రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించినట్లు తెలుస్తుంది.
అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు 18, 1945 లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించారు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు. దీని వల్ల ఆయన బతికి ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్ కు బందీ గా ఉండగా సైబీరియా లో మరణించాడని. దీనిని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది.
1956 మే నెలలో నలుగురు సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్ కు వెళ్ళింది. అప్పట్లో భారత్ కు తైవాన్ తో మంచి సంబందాలు లేకపోవడంతో వారి సహకారం కొరవడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1999-2005 లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమీషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్థారణకు వచ్చింది.
అంతే కాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమీషన్ కు లేఖను పంపడం జరిగింది.
ఈ కమీషన్ తన నివేదికను నవంబర్ 8, 2005 ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006 లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమీషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదనీ, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమీషన్ నివేదికను తిరస్కరించింది.
సుభాష్ చంద్ర బోస్ బ్రతికి వుంటే..ఈ దేశ పరిస్థితి ఇప్పుడు ఇంకోలాగుండేది!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి