13, మే 2014, మంగళవారం

కోటగిరి వెంకటకృష్ణారావు --- గంపలగూడెం రాజా కోటగిరి వెంకటకృష్ణారావు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న తొట్టతొలి ఆంధ్ర ప్రాంతానికి చెందిన జమీందారు

గంపలగూడెం రాజా కోటగిరి వెంకటకృష్ణారావు, కృష్ణా జిల్లా లోని గంపలగూడెం యొక్క జమీందారు. స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు మరియు సంఘ సంస్కర్త. వెంకటకృష్ణారావు 1920లలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న తొట్టతొలి ఆంధ్ర ప్రాంతానికి చెందిన జమీందారు. ఈయన ఉప్పు సత్యాగ్రహం, సహాయనిరాకరణోద్యమాలలో పాల్గొని, అనేక మార్లు జైలుకెళ్ళారు.
వెంకటకృష్ణారావు 1890లో నూజివీడులో పద్మనాయక వంశానికి చెందిన కుటుంబంలో చిన్నయ్య, సుబ్బాయమ్మలకు జన్మించారు. ఈయన్ను జగన్నాథరావు, సుబ్బాయమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు. ఈయన శృంగార తిలకము, యౌవననిగర్హణము, చాటు పద్యములు, శ్రీకృష్ణరాయనాటకావళి (అభినవ పాండవీయము, పాదుషా పరాభావము, బెబ్బులి, ప్రణయాదర్శణము అను నాలుగు నాటకాల సంపుటం), మాతృదేశము, విధి (పద్యకావ్యము), దేవదాసి (నాటకము), ఘోషావ్యాస ఖండనము మొదలగు రచలను చేశారు. శ్రీకృష్ణరాయనాటకావళి నాటక సంపుటికి విశ్వనాథ సత్యనారాయణ పీఠిక వ్రాశారు. తొలి మూడు కృతులలో శృంగార రసాన్ని పండించిన కోటగిరి ఆ తరువాత రచనలలో అంతే చక్కగా వీరరసాన్ని పండించాడని మిథునాపంతుల సత్యనారాయణశాస్త్రి ఈయన గురించి పేర్కొన్నారు.
ఉప్పు సత్యాగ్రహం సమయంలో వెంకటకృష్ణారావు, విజయవాడ నుండి 120 మంది స్వఛ్ఛందసేవకులతో కాలినడకన కోనసీమను చేరి అక్కడ ఉప్పును తయారుచేసి చట్టాన్ని ధిక్కరించారు. సాధారణంగా బ్రిటీషు వారికి అనుకూలంగా ఉండే జమిందారీ కుటుంబానికి చెందిన వెంకటకృష్ణారావు శాసనోల్లంఘనంలో పాల్గొనటం పలువురిని ఆశ్చర్యపరచింది. బ్రిటీషు పాలనలో జమీందారుదైనా, సామాన్యప్రజలదైనా బానిస బ్రతుకేనని, తన నాయకుడు మహాత్మా గాంధీ, ఆయన మాటే తనకు వేదమని చాటి, తీరాంధ్రలో ఉప్పు సత్యాగ్రహానికి మంచి ఊతమిచ్చారు.
1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈయన్ను కళాప్రపూర్ణ సత్కారంతో గౌరవించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి