2, ఏప్రిల్ 2014, బుధవారం

సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ --- నక్షత్రాల నిర్మాణం, పరిణామ దశలపై అద్భుతమైన సిద్ధాంతాలతో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన భారతీయ శాస్త్రవేత్త

సుబ్రహ్మణ్య చంద్రశేఖర్(అక్టోబర్ 19, 1910—ఆగస్టు 21, 1995) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. విలియం ఆల్ఫ్రెడ్ ఫోలర్ తో కలిసి నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను నోబెల్ బహుమతిని అందుకున్నాడు...
ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతులను మన దేశంలో ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు సాధించడం ఓ అరుదైన విషయం. వారిలో ఒక వ్యక్తి దేశంలోనే తొలి నోబెల్ పొందిన శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ కాగా, రెండో వ్యక్తి సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. తారల పరిణామ దశలకు సంబంధించిన పరిశోధనల్లో 'చంద్రశేఖర్ లిమిట్'గా ఇప్పటికీ ఉపయోగపడుతున్న సిద్ధాంతాలను అందించిన చంద్రశేఖర్, ప్రపంచ శాస్త్రవేత్తల సరసన నిలిచాడు.
ప్రతి వ్యక్తి జీవితంలో బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలున్నట్టే, నక్షత్రాల్లో రెడ్జెయింట్, వైట్డ్వార్ఫ్, సూపర్నోవా, న్యూట్రాన్స్టార్, బ్లాక్హోల్ అనే పరిణామ దశలుంటాయి. వీటి పట్ల అవగాహనను మరింతగా పెంచే సిద్ధాంతాలను, పరిశోధనలను అందించిన చంద్రశేఖర్ 1983లో భౌతికశాస్త్రంలో నోబెల్ పొందారు.
పంజాబ్లోని లాహోర్ (ప్రస్తుత పాకిస్థాన్)లో 1910 అక్టోబర్ 19న పదిమంది సంతానంలో మూడో వాడిగా, నలుగురు కొడుకుల్లో పెద్దవాడిగా పుట్టిన చంద్రశేఖర్ చిన్నప్పటి నుంచే చురుకైన విద్యార్థి. తండ్రి ఉద్యోగరీత్యా పలుప్రాంతాలు తిరిగినా వాళ్ల కుటుంబం తమిళనాడుకు చెందినదే. ప్రాథమిక విద్యను ఇంట్లోనే అభ్యసించిన చంద్రశేఖర్ మద్రాసులో హైస్కూల్లో చేరాడు. అక్కడి ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్రంలో పట్టభద్రుడై, ఆపై ప్రతిభతో ఉపకారవేతనం సాధించి లండన్లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడే తన 23వ ఏట పీహెచ్డీ సాధించి, ఆపై షికాగో విశ్వవిద్యాలయంలో శాఖాధిపతిగా చేరి జీవితాంతం అక్కడే ఉండిపోయారు.
సాపేక్ష, క్వాంటం సిద్ధాంతాల్లోని అంశాల ఆధారంగా ఆయన నక్షత్రాల పరిణామాలకు సంబంధించిన పరిస్థితులను విశ్లేషించారు. ఒక నక్షత్రం వైట్డ్వార్ఫ్ దశకు చేరుకోవాలంటే ఎలాటి పరిస్థితులుండాలో చెప్పిన సిద్ధాంతమే 'చంద్రశేఖర్ లిమిట్'గా పేరొందింది. దీని ప్రకారం సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.44 రెట్లకు తక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలే వైట్డ్వార్ఫ్గా మారతాయి. అంతకు మించిన ద్రవ్యరాశి ఉంటే అవి వాటి కేంద్రకంలోని గురుత్వశక్తి ప్రభావం వల్ల కుంచించుకుపోయి సూపర్నోవాగా, న్యూట్రాన్స్టార్గా మారుతూ చివరికి బ్లాక్హోల్ (కృష్ణబిలం) అయిపోతాయి.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నెలకొల్పిన ఖగోళ భౌతిక పరిశోధనాలయంలో కీలక బాధ్యత వహించారు. వృద్ధాప్యంలో సైతం ఆయన న్యూటన్ సిద్ధాంతాలను విశ్లేషిస్తూ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రాసిన 'న్యూటన్ ప్రిన్సిపియా ఫర్ కామన్ రీడర్' సైన్స్ అభిరుచి ఉన్నవారందరూ చదవవలసిన పుస్తకం. చంద్ర ఎక్స్రే వేధశాల, చంద్రశేఖర్ సంఖ్య, గ్రహశకలం 1958 చంద్ర అనేవి ఆయన సేవలకు శాస్త్రలోకం అర్పించిన నివాళులకు గుర్తులు. ఆయన 1995లో షికాగోలో తన 85వ ఏట మరణించారు.

1 కామెంట్‌: