16, ఏప్రిల్ 2014, బుధవారం

కందుకూరి వీరేశలింగం పంతులు( 16 ఏప్రిల్ 1848 - 1919 మే 27) -- తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి



కందుకూరి వీరేశలింగం పంతులు గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు ఆయన. తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. యుగకర్త గా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.
బాల్య వివాహలు, సతీసహగమనం, అస్పృశత, దురచారాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించి సంఘ సంస్కరణోద్యమ కర్తగా నిలిచి పత్రికా సంపాదకునిగా అవినీతిపై పోరాటం చేసి నాటక రచనలతో ప్రజా చైతన్యం కలిగించిన మార్గదర్శకుడు
ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి.
ఆయనకున్న ఇతర విశిష్టతలు:
  • మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి
  • మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు
  • తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే
  • తెలుగులో తొలి నవల రాసింది ఆయనే
  • తెలుగులో తొలి ప్రహసనం రాసింది కందుకూరి
  • తెలుగుకవుల జీవిత చరిత్ర రాసిన మొదటి వ్యక్తి
  • విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు రచయిత

వీరేశలింగంకు నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయాడు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం మొదలైనవి నేర్చుకున్నాడు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరాడు.. తన పదమూడో యేట బాపమ్మ అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసాడు.
చదువుకునే రోజుల్లో కేశవచంద్ర సేన్ రాసిన పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యాడు. విగ్రహారాధన, పూజలు మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాక, దయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చాడు. ప్రజలకు అది నిరూపించడానికి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళేవాడు. 1867 లో పెదనాన్న మరణంతో ప్రభుత్వోద్యోగంలో చేరాలని ప్రయత్నించాడు, కాని లంచం ఇవ్వనిదే రాదని తెలిసి, ప్రభుత్వోద్యోగం చెయ్యకూడదని నిశ్చయించుకున్నాడు. న్యాయవాద పరీక్ష వ్రాసి, న్యాయవాద వృత్తి చేపడదామని భావించినా, అందులోనూ అవినీతి ప్రబలంగా ఉందనీ, అబద్ధాలు ఆడటం వంటివి తప్పనిసరి అని గ్రహించి, అదీ మానుకున్నాడు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు.
కందుకూరికి సమకాలిక ప్రముఖుడైన కొక్కొండ వేంకటరత్నం పంతులు తో స్పర్ధ ఉండేది. కందుకూరి వివేకవర్ధని స్థాపించిన తరువాత కొక్కొండ హాస్య వర్ధని అనే పత్రికను ప్రారంభించాడు. పత్రికకు పోటీగా కందుకూరి హాస్య సంజీవిని అనే హాస్య పత్రికను ప్రారంభించాడు. తెలుగులో మొదటి ప్రహసనం కందుకూరి పత్రికలోనే ప్రచురించాడు. ఎన్నో ప్రహసనాలు, వ్యంగ్య రూపకాలు పత్రికలో ప్రచురించాడు.
ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం తోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసాడు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.. తప్పకుండా పాటించిన వ్యక్తి ఆయన.
సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేసాడో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకడు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవాడు కందుకూరి.
ఆయన 130 కి పైగా గ్రంథాలు వ్రాసాడు. ఆన్ని గ్రంధాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంధాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు వ్రాసాడు. స్వీయ చరిత్ర వ్రాసాడు. ఆంధ్ర కవుల చరిత్ర ను కూడా ప్రచురించాడు.
సంగ్రహ వ్యాకరణం వ్రాసాడు. నీతిచంద్రిక (తెలుగు పంచతంత్రం) లోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసాడు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం వీరేశలింగం గురించి ఇలా అన్నాడు: ఇది వీరేశలింగం సమాధి పైఈ నాటికీ కనిపిస్తుంది.

తన దేహము తన గేహము
తన కాలము తన ధనంబు తన విద్య జగ
జ్జనులకే వినియోగించిన
ఘనుడీ వీరేశలింగకవి జనులార!

1 కామెంట్‌: