31, మార్చి 2014, సోమవారం

ఉగాది -- తెలుగు సంప్రదాయానికి అద్దం పడుతూ ప్రకృతిని మన ముంగిటకు తెచ్చేదే ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగ లలో ముఖ్యమయినది

తెలుగు సంప్రదాయానికి అద్దం పడుతూ ప్రకృతిని మన ముంగిటకు తెచ్చేదే  ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగ లలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. "ఉగాది పచ్చడి" పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్ధం.షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది.దేవాలయములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల వంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

" మాసానాం మార్గశిర్మోహం...రుతూనాం కుసుమాకర... అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మా చెప్పారు.మాసాల్లో మార్గశిర మాసం రుతువుల్లో వసంత రుతువు ఉత్తమమైనది.మన పండుగలు అన్ని రుతువులఫైనే ఆధారపడి ఉంటాయి.ఉగాది వసంత రుతువులో వస్తుంది. రోజుల్లో ప్రకృతి అత్యంత రమణియంగా ఉంటుంది.తరుశాఖల చిగురులు.. పక్షుల కిల కిలారావాలు.. మామిడి చిగుళ్ళును ఆస్వాదించిన కోకిలల ఆలావనలు..అలా పరవశించిన ప్రకృతి ఒడిలో అందరూ ఉగాది సంబరాలు జరుపుకొంటారు ఉగాది పండుగ రావడంతో తెలుగిళ్ళు కళ కళలాడుతుంటాయి.ఎవరెన్ని కష్టాల్లో ఉన్నప్పిటికీ రోజున మాత్రం ఆనందంగా గడుపుతారు.ఎందుకంటే ... సంవత్సరం ప్రారంభం రోజున ఎలా ఉంటె... సంవత్సరం అంతా అలానే ఉంటారనేది నమ్మకం

ఉగాది రోజున తెల్లవారు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు పూజ చేయడం మంచిది. ఉగాది మనకు సంవత్సరాది. రోజున బ్రాహ్మీ ముహూర్తానలేచి, అభ్యంగన స్నానం చేయడం అతిముఖ్యమైన విధి. ఉగాది నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. నవరాత్రులూ దేవిని ఆరాధిస్తారు.

"ఉగాది" అన్న తెలుగు మాట "యుగాది" అన్న సంస్కృతపద వికృతి రూపం. బ్రహ్మ దేముడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంబించిన రోజు. దీనికి ఆధారం వేదాలను అధారం చేసుకొని వ్రాయబడిన "సూర్య సిద్ధాంతం" అనే ఖగోళ జ్యోతిష గ్రంథంలోని శ్లోకం

"'చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పధమే అహని,
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తధై వచ'"

అనగా బ్రహ్మ కల్పం ఆరంభమయే మొదటి యుగాది అంటే మొదటి సంవత్సరం (ప్రభవ) లో మొదటి ఋతువు వసంత ఋతువు లో మొదటి మాసం ( చైత్ర మాసం) లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్ధం. అందుకే మొదటి సంవత్సరానికి "ప్రభవ" అని పేరు. చివరి అరవైయ్యొవ సంవత్సరం పేరు "క్షయ" అనగా నాశనం అని అర్ధం. కల్పాంతం లో సృష్టి నాశనమయ్యేది కూడ "క్షయ" సంవత్సరంలోనే. అందుచేతనే చైత్రమాసం లో శుక్లపక్షం లో సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉన్న రోజును యుగాది అదే ఉగాదిగా నిర్ణయించబడింది.

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. "ఉగాది", మరియు "యుగాది" అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే అయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది

ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు, ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఉగాదిరోజు మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. తర్వాత ఏమీ తినకముందే ఉగాది పచ్చడిని తింటారు. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి 'అక్షయ'నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చూస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు

 

పండుగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు

 

1 కామెంట్‌: