2, జూన్ 2012, శనివారం

ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం – శ్రీకాకుళం

శ్రీకాకుళం , కృష్ణా జిల్లా, ఘంటసాల మండలానికి చెందిన గ్రామము. దివిసీమకు చెందిన కృష్ణా నది తీర గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆంధ్ర మహా విష్ణువు మందిరం. ఈ దేవాలయం క్రీ.పూ.3 శతాబ్దం నాటికే నిర్మించబడి ఉందని ఆధారాలున్నాయిట. మన భారతదేశంలోని అతి పురాతన దేవాలయాలలో ఇదీ ఒకటని చెప్పవచ్చు.

ఆంధ్రభాషపై ప్రీతి గల విష్ణువు శ్రీకాకుళంలో వేంచేసియున్న ఆంధ్రమహావిష్ణువు

ఆలయం ప్రాచీనతే కాకుండా ఈ వూరు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉన్నది.

దేశభాషలందు తెలుగులెస్స! అని బోధించి కృష్ణదేవరాయలచే ఆముక్త మాల్యద రచింపచేసింది స్వామియే

విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు తన కళింగ దండయాత్ర మార్గంలో (క్రీ..1518లో) ఇక్కడి విజయవాడ, కొండపల్లి దుర్గాలను జయించాడు. తరువాత మందిరం గురించి విని ఇక్కడి స్వామిని దర్శించుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. రాజుకు కలలో విష్ణువు దర్శనమిచ్చి ఆముక్తమాల్యదని నిర్మించమన్నారు. అతను కూడా సంతోషంగా కావ్యరచనకి పూనుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగదేలయన్న దేశంబు తెలుగు, యేను తెలుగు వల్లభుండ, తెలుగు కండ ... యెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స యని తలచి ఆముక్త మాల్యద ప్రబంధమును తెలుగు భాషలో రచించాడు.

తరువాత కాలంలో కాసుల పురుషోత్తమ కవి వ్యాజస్తుతి విధానంలో వ్రాసిన ఆంధ్రనాయక శతకము చాలా ప్రసిద్ధ చెందింది. అప్పటికి ఈ ఆలయం శిధిలావస్థలో ఉన్నందున కవి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ! హత విమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ అనే మకుటంతోశతకాన్ని వ్రాశాడు.

కాసుల పురుషోత్తమ కవి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు మీద నిందాస్తుతిగా ఈ శతకం రచించారు. తెలుగు భాషలో భక్తి శతకాలు, నీతి శతకాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ ఈలాంటి వ్యాజస్తుతి శతకాలు అరుదు. నిందలో స్తుతిని, స్తుతిలో నిందను నిబంధించి భక్తితత్త్వాన్ని ప్రబోధించిన శతకరాజమిది. కాసులకవి నవ్యమైన భవ్యమైన వినుత్న పదాలతో ఎన్నెన్నో భావతరంగఅలను వెలార్చే 108 సీస పద్యాలతో ఈ శతకాన్ని ఆంధ్రులకు ఉపాయనంగా అందించి ధన్యుడయ్యాడు.

కాసుల పురుషోత్తమ కవి అసలు పేరు పల్లంరాజు. ఈయన కృష్ణా జిల్లా లోని పెదప్రోలు గ్రామ నివాసి. సుమారు క్రీ.శ.1800 ప్రాంతానికి చెందినవాడు. ఈయన తల్లిదండ్రులు - రమణమాంబ మరియు అప్పలరాజులు. అద్దంకి తిరుమలాచార్యులు వీరి గురువులు. దేవరకొండ సంస్థానాధీశుడైన రాజా అంకినీడు బహద్దూర్ గారి ఆస్థానకవిగా ప్రసిద్ధుడు.





4 కామెంట్‌లు:

  1. మంచి టపా. చక్కని వివరాలు ఇచ్చారండీ. ధన్యవాదాలు. ఆంధ్రనాయక శతకం ( కాసుల పురుషోత్తమ కవి ) ప్రస్తావన ఎక్కడా చేయ లేదేమి ?

    రిప్లయితొలగించండి
  2. కొన్నేళ్ళ క్రితం ఈ దేవాలయాన్ని చూశాను. ఎంతో ప్రాచుర్యం పొందిన ఆంధ్రనాయక శతకాన్ని కాకుండా దాని సంస్కృత అనువాద భాగాలను ఈ గుడి గోడలపై రాయించటం విచిత్రంగా అనిపించింది!

    రిప్లయితొలగించండి
  3. మీ సూచనమేరకు ఆంధ్రనాయక శతకం ( కాసుల పురుషోత్తమ కవి ) వివరాలను జతపరిచాను , మీ అభిప్రాయము తెలిపినందుకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  4. ...యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి...

    రిప్లయితొలగించండి