14, మార్చి 2014, శుక్రవారం

రాయప్రోలు సుబ్బారావు

 

"ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము"

అంటూ "జన్మభూమి" గీతాన్ని రచించి.. తెలుగు జాతి గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన సుప్రసిద్ధ రచయిత, కవి రాయప్రోలు సుబ్బారావు. నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు (1892 - 1984) తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో రాసిన తృణకంకణముతో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు.
జాతీయోద్యమ కవిత్వాన్ని పుష్కలంగా రచించిన కవి రాయప్రోలు సుబ్బారావు. “నాదు జాతి, నాదు దేశము, నాదు భాష అను అహంకార దర్శనమందు” అని ప్రబోధిస్తూ జాత్యభిమానం, దేశాభిమానం, భాషాభిమానం ప్రతి ఒక్కరికీ నరనరాల్లో జీర్ణించుకుపోయేలా ఆయన సృజన చేశారు.

ఉవ్వెత్తున ఎగసిన కెరటంలాంటి చైతన్యంతో సాగిన భారత స్వాంతంత్ర్యోద్యమంలో అదే స్పూర్తితో ఆంధ్రులు పోరాడారు. నిండైన దేశ భక్తి అందించిన కొత్త ఊపిరి పోసుకొని తెలుగు కవులు శంఖారావాన్ని పూరించారు. వివిధ ప్రక్రియలను వాహికలుగా చేసుకొని రచనలు చేసి ఉద్యమానికి ప్రేరకులయ్యారు. ప్రజలను దేశం కోసం పాటుపడే విధంగా తయారు చేయడం కోసం, దేశ భక్తిని నూరిపోసేందుకు కవుల కలాలు జోరుగా సాగాయి.

కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత.18వ శతాబ్దంలో జర్మనీ, ఫ్రాన్సు దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ చిత్రకారులనూ, రచయితలనూ, శిల్పులనూ, కవులనూ గాఢంగా ప్రభావితం చేసింది. పాశ్చాత్యదేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మళ్ళించాడు.

అయితే రాయప్రోలుది గ్రుడ్డి అనుకరణ కాదు. తెలుగు, సంస్కృత భాషా పటిమను ఆయన విడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి