14, మార్చి 2014, శుక్రవారం

ఏ దేశమేగినా ఎందుకాలిడినా........ శ్రీ శ్రీ శ్రీ రాయప్రోలు సుబ్బారావు



దేశమేగినా ఎందుకాలిడినా
పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము.
పూర్వ పుణ్యమో, యోగ బలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున
మంచిపూవులన్ ప్రేమించినావో
నిను మోచె తల్లి కనక గర్భమున.
లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేరురా మనవంటి పౌరులింకెందు
సుర్యుని వెలుతురుల్ సోకునందాక
ఓడల జెండాలు ఆడునందాక.
అందాకాగల అనంత భూతలిని
మన భూమివంటి చల్లని తల్లి లేదు
పాడరా నీవీర భావ భారతము.
తమ తపస్సులు ఋషులు ధారవోయంగ
శౌర్యహారము రాజచంద్రులర్పింప
భావ సూత్రము కవిప్రభువులల్లంగ
రాగ దుగ్ధము భక్తరత్నముల్ పిదుక.
దిక్కులకెగదన్ను తేజమ్ము వెలగ
రాళ్ళ తేనియలూరు రాగాలుసాగ
జగముల నూగించు మగతనంబెగయ
సౌందర్యమెగబోయు సాహిత్యమలర
వెలిగిన దీ దివ్య విశ్వంబు పుత్ర
దీపించె నీ పుణ్య దేశంబు పుత్ర
పొలముల రత్నాలు మొలిచెరా యిచట
వార్ధి లో ముత్యాలు పండేరా యిచట
పృథివి దివ్యౌషుధుల్ పిదికెరా మనకు
కానల కస్తూరి కాచెరా మనకు
అవమానమేలరా? అనుమానమేల?
భారతీయుడనంచు భక్తితో పాడ...
.... శ్రీ శ్రీ శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారి విరచితము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి