7, మార్చి 2014, శుక్రవారం

సురవరం ప్రతాపరెడ్డి

చిత్రముచిత్రము
సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమము ఇతని ఇతర ముఖ్య రచనలు. నైజాం నిరంకుశ పాలనలో, తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశారు తెలుగుజాతికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది. 1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను "కేంద్ర సాహిత్య అకాడమి" అవార్డు లభించింది.
సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు లో జన్మించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్కూరులో బి.ఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించారు. అనేక భాషలు అభ్యసించారు. మంచి పండితుడు. 1926 లో ఆయన నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించారు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది.
తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 350 మంది కవుల రచనలతో గోలకొండ కవుల సంచిక అనే సంకలనాన్ని 1934 లో ప్రచురించారు. ఆ సంచిక ఇప్పటికీ అపురూపమైనది. సురవరం ప్రతాపరెడ్డి కథలు నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రించినయి. హైందవ ధర్మ వీరులు, హిందువుల పండుగలు, రామాయణ కాలం నాటి విశేషాలు మొదలైన ఇతర గ్రంథాలను రచించిండు. భక్త తుకారాం, ఉచ్ఛల విషాదము అనే నాటకాలు రాసారు. తెలంగాణాలో గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖపాత్ర వహించారు. 1942 లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించారు. 1943 లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభకు, 1944 లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆయనే అధ్యక్షుడు.

1951 లో ప్రజావాణి అనే పత్రికను ప్రారంభించారు. 1952 లో హైదరాబాదు రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరపున వనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభ కు ఎన్నికయ్యారు. న్యాయవాదిగా ఆయన జీవితం ప్రారంభించి, రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడుగా జీవితం సాగించి తెలంగాణ ప్రజల హృదయాలలో ముద్రవేసుకున్నారు. 1953 ఆగష్టు 25న ఆయన దివంగతుడైనాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి